అపార విజ్ఞ - 1


అపార విజ్ఞ - 1



ఉఁ... చదవండి!
చతుర్ధ భూమిక - నాల్గవ భూమిక
చతుర్ధ స్వర్గము - ఉఁ

గు: ఎన్ని భూమికలు వున్నాయి అసలు?
శి: 7 భూమికలు
గు: ఏడు, ఏడు జ్ఞాన భూమికలు. అర్థమైందా అండీ?
"సప్తజ్ఞాన భూమికలతో చెప్పినటువంటి భగవద్వచనమే" వివరిస్తున్నారు. అందులో నాల్గవభూమికను వివరిస్తున్నారు.

'చతుర్ధ స్వర్గము' అన్నారు... ఎందుకని 'స్వర్గము' అన్నారు?
దాని అర్థము - ఏడు భూమికలకి... ఏడు స్వర్గాలు వున్నట్లేగా....! అంతేనా?
అంటే ఈ ఏడు జ్ఞాన భూమికలు కూడా... దివ్యయానాలకు సంబంధించినటువంటివి.
అంటే దైవీ స్థితులతో కూడుకుని వున్నాయి.
అంటే జీవభావంతో ఈ జ్ఞానభూమికలను దాటలేము. అర్థమైందా అండీ?
దైవీ స్థితులతోనే, ఈ సప్త జ్ఞాన భూమికలను అధిరోహించగలుగుతాము.

అందుకని ఆయన ఏమన్నారు దీనిని?
'స్వర్గము' అన్నారు. ఆ స్వర్గము అనడం వెనుక రహస్యం అదన్నమాట! అర్థమైందా ఇప్పుడు?

ఉఁ... అంటే ఆ దైవీ లక్షణాలతో వున్నప్పుడు మాత్రమే ఈ మెట్లు ఎక్కగలుగుతావు... అనేది గుర్తుపెట్టుకోవాలి.
అందుకని ఆ ఎత్తుగడ ఆ Title వ్రాయడంలోనే.... అలా వ్రాశారన్నమాట!

ఉఁ... చదవండి!
చదువరి: జీవాత్మ.... భౌతిక ఉపాధిని పొందిన తరువాత, పరిణామ చైతన్యంలో, తక్కువ స్థాయి చైతన్యానికి... దిగజారడం వుండదు.
అంటే అర్థం ఏమిటి?
అంటే మన ప్రయాణం ఎక్కడ మొదలయ్యింది సృష్టి?
జీవాత్మ యొక్క ప్రయాణం.... ఎక్కడి నుంచీ మొదలయ్యింది?
శి: లోహం నుంచీ...
గు: ఉఁ.... శిల, మృత్తిక, లోహం నుంచీ మొదలయ్యింది. వృక్షాలుగా వచ్చాడు. తరువాత జంతుజాలంగా అయ్యాడు. ఆ తరువాత మనిషి అయ్యాడు. అర్థమైందా! అండీ?
ఈ పరిణామ క్రమంలో.....
దీనినంతా ఏ పరిణామ క్రమం అన్నారు దీనిని?
పరిణామం రెండు రకాలు... అవునా, కాదా?
చైతన్య వ్యావర్తనం - ఒక పరిణామ క్రమం.
చైతన్య వికాసం - ఒక పరిణామ క్రమం... అర్థమైందా? అండీ!

మానవోపాధి సృష్టిలో వ్యక్తమయ్యేంత వరకూ వున్నదేమో చైతన్య వ్యావర్తనం. అంటే పరమాత్మ స్థితి నుంచీ క్రమంగా చైతన్యం దిగి వచ్చి, దిగి వచ్చి, దిగి వచ్చి.... స్థూల స్థితిని పొంది, స్థూలంగా ఉపాధులు ధరిస్తూ... మానవోపాధి వ్యక్తం అయ్యింది.

వ్యక్తం అయ్యేవరకూ వున్న భాగం ఏమిటి?
చైతన్య వ్యావర్తనం. అర్థమైందా? అండీ!

మానవోపాధి వ్యక్తమైన తరువాత ఏం మొదలయ్యింది?
చైతన్య వికాసం.
పరిణామం రెండు భాగాలయ్యిందన్నమాట. దీనిని అర్థం చేసుకోవడం కోసమని చెబుతున్నాము ఇట్లా....!
ఉన్నది ఒక్కటే!
కానీ... చైతన్యం ఏమైంది?
తనంతట తాను పరిణామం చెందుతూ, చెందుతూ, చెందుతూ, చెందుతూ.... మానవోపాధి వ్యక్తమయ్యేదశ వరకూ... సృష్టిలో వ్యక్తమయ్యేంత వరకూ చైతన్య వ్యావర్తనంగానూ, మానవోపాధి వ్యక్తమైన తరువాత, ఇంకా వేరే ఉపాధులు వచ్చే అవకాశం లేదు, ఇదే ఆఖరి ఉపాధి.

ఇక్కడి నుంచీ మనం ఏ దశలోకి వచ్చాం... ఇప్పుడు?
చైతన్య వికాసం. అంటే చైతన్యం తన మూలాన్ని తను గుర్తెరగడం అనే పని మానవోపాధి రాగానే మొదలయ్యింది.

అప్పటి వరకూ ఏం చేసింది?
తనకంటే అన్యమైనటువంటి దానిని వెతికేటటువంటి ప్రయత్నంగా, తన కంటే భిన్నమైన దానిని ఏర్పరచే ప్రయత్నంగా.... చైతన్య వ్యావర్తనం జరిగింది.
జరిగి, జరిగి, జరిగి, జరిగి.... ఎక్కడికి వచ్చాడు?
మానవోపాధికి వచ్చాడు. మానవోపాధికి వచ్చేప్పటికి చైతన్య వ్యావర్తనం పూర్తి అయిపోయింది. ఇంకా తరువాత వచ్చే ఉపాధులు లేవు.

"దుర్లభం మానుష దేహం" - అని ఎందుకు అంటున్నాము?
చైతన్య వ్యావర్తనంలో ఇదే ఆఖరి ఉపాధి. దీని తరువాత ఉపాధులు లేవు.

ఇప్పుడు మనకొక వాగ్దానం చేస్తున్నారు అవతారుడు. ఏమని?
చైతన్య వికాస క్రమంలో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతున్నావే....
ఈ దైవీ లక్షణాలతో సప్తజ్ఞాన భూమికలనేటటువంటి... అధిరోహణం చేసేటటువంటి వారు ఎవరైతే వున్నారో...

ఏమండీ..! మేం పడిపోతే ఏమౌతాం?
ప్రశ్న అదన్నమాట! ఇదే ప్రశ్న అర్జునుడు కూడా భగవద్గీతలో అడిగాడు.
ఇగో... నేనయ్యా... ! నువ్వు చెప్పినటువంటి పరమాత్మ స్థితి, పరమపదము అనేటటువంటి స్థితికి, పరాత్పర పరబ్రహ్మం అనేటటువంటి స్థితికి... నేను చేరలేకపోయాను. మధ్యలోనే ఉపాధి పడిపోయింది. ఏమౌతాను?
యోగ భ్రష్టుడనైతే నేనేమౌతాను?
అని ఆయన అక్కడ అడిగాడు ప్రశ్న.
అదే ప్రశ్నకి ఇక్కడ కూడా సమాధానం చెబుతున్నారు.
ఏమని చెబుతున్నారు?
చైతన్య వికాస క్రమంలో సప్తజ్ఞాన భూమికలనే అధిరోహణం ఎవరైతే చేస్తారో, ఈ జ్ఞాన ప్రభావం చేత, ఈ దైవీ లక్షణాల ప్రభావం చేత,
నీ ఉపాధి పడిపోయినా కూడా... నీ జ్ఞానమేమీ (అధోముఖ) పరిణామం చెందదు. నీ వేమీ అధమ ఉపాధులలోకి పడిపోవు.

'అధమ ఉపాధులు' - అంటే ఏమిటి?
మానవోపాధినుంచీ తక్కువ(గా) స్థాయిలలో వున్నటువంటి ఉపాధులలోకి నువ్వు పడిపోవు.

ఎప్పుడు?
ఈ సప్త జ్ఞాన భూమికలను గనుక నీవు అధిరోహించినట్లయితే!

అదే నువ్వు అజ్ఞానంలోనే వున్నావు... అప్పుడేమయ్యావు?
అప్పుడు ఆ అవకాశం వుంది. ఇదే మాట భగవద్గీత కూడా చెబుతుంది.
తమోగుణ ధర్మంగా, అజ్ఞాన యుతంగా, కేవలమైన అజ్ఞాన భూమికలలో... సప్త జ్ఞాన భూమికలు ఎలా వున్నాయో, సప్త అజ్ఞాన భూమికలున్నాయి. ఆ ఏడు అజ్ఞాన భూమికలలోనే గనుక తిరగుతూ, నువ్వు మానవోపాధిలోనే వున్నావనుకో...!
అప్పుడు నిన్ను ఏది... ఏ గుణం ఆవరించింది?
తమోగుణ ధర్మాలు అవరించింది. తత్‌ప్రభావం చేత, నువ్వు మానవోపాధిని కోల్పోయే అవకాశం వుంది.

అదే నువ్వు జ్ఞాన భూమికలను గనుక అధిరోహించావు.... ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు...!
ఈ జ్ఞానభూమికలను గనుక ఎవరైతే నిజ జీవితంలో, స్వానుభూతి ప్రమాణంతో సిద్ధింపజేసుకుంటారో, వాళ్ళకి.... అధవా పడిపోయినా, మళ్ళా మానవుడిగానే పుడతాడు. మానవుడి నుంచి క్రింది స్థాయి ఉపాధులలో జన్మ ఎత్తడు. కాబట్టి, చైతన్య వికాసం... పురోగతే తప్ప, తిరోగమనం లేదు. "చైతన్య వికాసంలో పురోగమనమే తప్ప, తిరోగమనం లేదు" - అనేటటువంటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఇక్కడ.

కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు?
ఆఁ.... ఆ అజ్ఞాన భూమికలనుంచీ, జ్ఞానభూమికలలోనికి గనుక పురోగమనం చేసినట్లయితే... నీకొక assurance వుంది, నీవిక పడిపోవు.

మళ్ళా ఒకవేళ పుట్టినా.... ఎలా పుడుతావ్‌?
మానవుడిగానే పుడతావు.

ఇంకేమి assurance ఇస్తున్నాడు?
ఏ జ్ఞానంతో అయితే నువ్వు ఉపాధిని విడిచిపెట్టావో, అదే జ్ఞానంతో మరలా వస్తావు. కాబట్టి జ్ఞానానికి కొనసాగింపే వుంటుంది, తరువాత ఉపాధిలో కూడా. మరలా ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయి సున్నానుంచీ మొదలుపెట్టాల్సిన పని వుండదు. కాబట్టి 'జ్ఞానభూమికలను అధిరోహించడం అనేది మానవజన్మలో అతిముఖ్యమైన పని'.

మనం అన్నీ ముఖ్యమైన పనులని అనుకుంటున్నామా? లేదా?
ఏమిటి? మన ముఖ్యమైన పనులు?
పుట్టడం, చదువుకోవడం, పెళ్ళి చేసుకోవడం, సంసారం, పిల్లలు, వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడం, డబ్బులు వెనుకెయ్యడం, ఇల్లు కట్టడం.... ఇదంత చేసి, చివరికి చనిపోవడం! ఇవన్నీ మన పనులనే అనుకుంటున్నాము.
వీటిల్లో ఎక్కడైనా జ్ఞానభూమికలతో పని వచ్చిందా? ఇప్పుడు?
లేదు.
కాబట్టి ఇవన్నీ... దేనితో కూడుకుని వున్నాయి?
భౌతిక లక్షణాలతో, అజ్ఞానంతో... కూడుకుని వుంది. విషయ సుఖంతో కూడుకుని వుంది. ఈ అజ్ఞానంతో జీవించేటటువంటి జీవితంలో నుంచి, నువ్వు దైవీ లక్షణాలతో ఎదిగేటటువంటి సప్తజ్ఞాన భూమికలలో గనుక నీవు అధిరోహించనట్లయితే...

ఎందుకు 'అధిరోహణం' అని అంటున్నాము?
ఉన్నతమైన మార్గం కాబట్టి, నువ్వు సాధన పూర్వకంగా ఎక్కాలి. సద్గురువు ఆశ్రయంతో ఎక్కాలి. అవతారుని ఆశ్రయంతో ఎక్కాలి. నీ కంటే ముందు నడిచిన వాళ్ళ మార్గదర్శకత్వంతో నువ్వు నడవాలి. అర్థమైందా? అండీ! అది అధిరోహణం అంటే!

పిల్లవాడు... చిన్న పిల్లవాడు మెట్లు ఎక్కాలండీ... ఏం చేస్తాడు?
నువ్వు temple కి తీసుకు వెళ్ళావు. మెట్లు వచ్చినాయి అక్కడ. పిల్లాడు ఏం చేస్తాడు?
శి: మనం సహాయం చేస్తాం... లేదంటే....
గు: నువ్వు పట్టుకోలేదండీ! నువ్వు పట్టుకోకుండా, నువ్వు టకటకా నాలుగైదు మెట్లు ఎక్కావు. వాడు మెట్లదగ్గరకి వచ్చి పైకి చూస్తాడు. అవునా? కాదా?
పైకి ఎన్ని మెట్లు కనబడుతాయి? ఓహ్‌... బోల్డు మెట్లు కనబడుతాయి. వాడు అక్కడే నిలబడి చూస్తుంటాడు.
వాడు రాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి?
నువ్వే మళ్ళా నాలుగు మెట్లు క్రిందకు దిగి... వాడి చెయ్యిపట్టుకుంటే, ఆఁ.... ఈయన సహాయం వుంది కాబట్టి నేను ఇప్పుడు ఎక్కగలుగుతాను. అని తోస్తుంది వాడికి. వాడు ఎక్కడం మొదలుపెడుతాడు. అర్థమైందా అండీ?
మన పరిస్థితి కూడా ఇదే! సప్తజ్ఞాన భూమికల దగ్గరకి వచ్చేటప్పటికి, అజ్ఞాన భూమికలను పూర్తి చేసుకుని, ఆ మొదటి మెట్టు దగ్గర నిలబడి పైకి చూస్తూ వుంటాము.
ఎవరు వస్తారు రా బాబు? మనకు చేయి అందించే వాడు.... ఎవరు వస్తారు రా బాబు? మనకు చేయి అందించే వాడు? అని,
ఆ చెయ్యి అందించేటటువంటి సద్గురుమూర్తి సహాయం అందుకోగానే, నువ్వు చకచకా ఆ అధిరోహణాన్ని పూర్తి చేస్తావు.
కాబట్టి, "సద్గురు కృప, అవతార కృప.... జ్ఞానభూమికలను అధిరోహించడంలో అత్యంత ముఖ్యమైనది".

వాళ్ళ మార్గదర్శనం ముఖ్యమైనది. వీటి వల్ల ఒక ప్రయోజనం కూడా వుంది. ఏమిటీ?
ఈ జ్ఞానభూమికలను అధిరోహిస్తే.... మరల అజ్ఞాన భూమికల్లో ఇక... పడిపోయే అవకాశం లేదు. అధోగతమైనటువంటి ఉపాధులను పొందే అవకాశం లేదు. నిమ్నగతమైనటువంటి ఉపాధుల్లోకి చేరే అవకాశం లేదు.
(తరువాత)
చదువరి: పరిణామ క్రమంలో, ఒక మారు పొందిన చైతన్యాన్ని... ఎవ్వరూ పోగొట్టుకోవడం జరుగదు.
(ఆగు అక్కడికి) ఏం చెబుతున్నాడు?
పరిణామ క్రమంలో...
పరిణామ క్రమంలో...  అంటే...?
ఒక్కొక్క ఉపాధిని మారుస్తూ వచ్చాము. పరిణామంలో. అది సహజమైన పరిణామం. కానీ... చైతన్యవికాసం సాధనపరమైన పరణామం.
మానవోపాధి వచ్చే వరకూనేమో, ఉపాధులను మార్చడం ద్వారా చైతన్యం పరిణామం చెందింది. మానవోపాధికి వచ్చేసిన తరువాత... ఉపాధులను మార్చడం ద్వారా పరిణామం చెందదు ఇక.
అదేంటండీ?
ఇక్కడే మనకీ, విజ్ఞాన శాస్త్రానికి భేదం వుందండీ! వేదాంతానికి, విజ్ఞానానికి ఇక్కడే భేదం పుట్టిందన్నమాట.

ఎలా పుట్టింది అంటే? విజ్ఞానం ఏం చెప్పింది?
నువ్వు ఎలాగైతే, అమీబా నుంచీ, ఒక్కొక్క జీవిగా పుడుతూ, పుడుతూ, పుడుతూ పోతూ, పుడుతూ పోతూ, పుడుతూ పోతూ.... మానవుడి దాకా వచ్చావా? లేదా? అలాగే మానవుడిగా పుడుతూ పోతూ, పుడుతూ పోతూ... ఆదిమ మానవుడు నాగరిక మానవుడు అయ్యాడు... అంటుంది.
అలా అవ్వలేదు అంటోంది - వేదాంతం.
అలా అవ్వలేదయ్యా! ఆదిమ మానవుడు పుట్టిపోతే, మరలా ఆదిమ మానవుడే అవుతాడు. ఎందుకనీ?
మానవోపాధిలో చైతన్య వికాసం అనేది, అతని యొక్క సాధనాబలంతోటే సాధ్యమవుతుంది గానీ... ఉపాధులను మార్చడం ద్వారా సాధ్యం కాదు. అంటే అప్పుడు ఏమనాలి మనం?
ఆదిమ మానవులు ఎప్పుడూ ఆదిమ మానవులుగానే పుడుతారు. నాగరిక మానవులు ఎప్పుడూ నాగరిక మానవులుగానే పుడతారు అనే అర్థాన్ని స్ఫురింపజేస్తుందా ఇది?
అలా స్ఫురింప జేయడం లేదు.
ఇప్పుడు రాళ్ళు కొట్టే దశలో వాడు నిప్పు కనుక్కొన్నాడా? లేదా?
రాళ్ళు కొట్టడం ద్వారా నిప్పు కనుక్కోవడం అనే సాధన చేయడం ద్వారా ఏమయ్యాడు?
ఆదిమ మానవుడు నాగరిక మానవడయ్యాడు.
నిప్పు కనుగొనబడనంత వరకూ ఆదిమ మానవుడు... ఆదిమ మానవుడిగానే వున్నాడు. మరి అది సృష్టిలో లేదా?
సృష్టిలో వున్నదే. కానీ సాధన ద్వారా తాను కనుక్కునేటటువంటి ప్రయత్నం చేసేటప్పటికీ... తరువాత....

(సశేషం)